కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.[1] ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.