Former Pakistan player Shoaib Akhtar has revealed that Team India captain Virat Kohli could hit 120 international centuries and go on to break the great Sachin Tendulkar’s record of 100 international tons.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఒక ఇంటర్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ 'విరాట్‌కోహ్లీ మోడ్రన్ డే గ్రేట్. లక్ష్య ఛేదన కోసం క్రీజులోకి వచ్చాడంటే కోహ్లీని ఆపడం ఎవరితరం కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డును కోహ్లీ మాత్రమే బద్దలు కొట్టగలడన్నది నా నమ్మకం' అని అన్నాడు.
'కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అతను తన ఆటను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పాకిస్థాన్ ఆటగాడు మిస్బా ఉల్ హాక్ అంతర్జాతీయ క్రికెట్‌లో 43ఏళ్లు వచ్చే వరకు ఆడాడు. కోహ్లీ 44 ఏళ్ల వరకు ఆడతాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ అతడు 44 ఏళ్ల వరకు ఆడి.. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే 120 సెంచరీలు నమోదు చేయడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు' అని అక్తర్ అన్నాడు.
కాగా, విరాట్ కోహ్లీ చాలా తక్కువ సమయంలో అన్ని ఫార్మట్లలో కోహ్లీ 50 సెంచరీలు చేసి ప్రపంచ క్రికెట్ అభిమానులను తనవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో 32 సెంచరీలు, టెస్టుల్లో 18 సెంచరీలు సాధించిన కోహ్లీ మొత్తంగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 'ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బౌలర్లపై కోహ్లీదే ఆధిపత్యం. వన్డేల్లో ఇప్పటికే 32 సెంచరీలు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో ఉంది సచిన్. ఈ ఏడాది టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. తాజాగా ఈడెన్‌లో సెంచరీ సాధించి టెస్టు క్రికెట్‌లోనూ ఫామ్‌లోకి వచ్చాడు' అని అక్తర్ అన్నాడు.