The Election Commission announced the date for Kurnool mlc election 2017 tuesday. The polling for kurnool mlc seat will take place on january 12.
రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామానికి తెరలేవనుంది. నంద్యాల ఉప ఎన్నికతో ఎపి అంతా వేడెక్కిపోగా మరోసారి ఈ సెగ తాకనుంది. కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి జనవరి 12 న ఉప ఎన్నిక జరపనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల సందర్భంలో టిడిపిని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఎమ్మెల్సీ కావడంతో ఆ స్థానానికి ఈ బై ఎలక్షన్ జరుగబోతోంది.
ఈ నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం ఉపఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన కర్నూలు ఎమ్మెల్సీ ఉపఎన్నిక కు నోటిఫికేషన్ జారీ అవుతుంది. 26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 27న నామినేషన్ల పరి శీలన, 29 వరకు ఉప సంహరణ జరుగుతాయి. ఆ తదుపరి బరిలో ఉన్నఅభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 2018 జనవరి 12వ తేదీ ఉదయం గం.8 నుంచి సాయంత్రం గం.4 వరకు పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు ,ఫలితాల వెల్లడి ఉంటాయి. నేటి నుంచి కర్నూలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఎన్నికల ప్రకటన వెలువడడంతో కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా రాజకీయవేడి ప్రారంభమైంది.