Jagan fired at chandrababu naidu in his Padayatra
పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తారా, గత చరిత్రను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పునరావృతం చేస్తారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడులు ముఖ్యమంత్రులయ్యారు. జగన్ పాదయాత్ర ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే ఉత్కంఠ నెలకొంది. ప్రజల వద్దకు వెళ్ళేందుకు రాజకీయ పార్టీల నేతలు పలు రకాల కార్యక్రమాలను ఎంచుకొంటారు. అయితే పాదయాత్రలు నిర్వహిస్తే నిత్యం ప్రజల మద్యే ఉండే అవకాశం దక్కనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులకు ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయపరిస్థితులకు తేడా ఉంది. అయితే వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను నవంబర్ 6వ, తేదిన ప్రారంభించారు. ఏడాది మార్చి వరకు జగన్ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇడుపులపాయ నుండి ఇఛ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు జగన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను కూడ వివరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.