Mega Star Chiranjeevi’s son-in-law and the most handsome looking Kalyaan Dhev’s debut film is officially launched today.
'మెగా కాంపౌండ్..' ఇండస్ట్రీలో ఇదో బ్రాండ్. ఆ క్యాంప్ నుంచి లాంచ్ అయితే చాలు ఇక 'హీరో' అనిపించుకోవడమే తరువాయి. అలా ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడా 'కాంపౌండ్' పరిధిని మరింత పెంచుతూ మరో హీరో కూడా లాంచ్ అయ్యాడు. అతనే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఈ మెగా అల్లుడి కొత్త సినిమా బుధవారం తెల్లవారుజామున లాంఛనంగా ప్రారంభమైంది..
వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో 'జత కలిసే' సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
నేటి ఉదయం వారాహి చలనచిత్ర ఆఫీసులో పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కార్యక్రమానికి హాజరై.. 'కళ్యాణ్ దేవ్'కు శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా.. ముహూర్తపు షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.
సినిమా ప్రారంభోత్సవం అనంతరం నిర్మాత సాయికొర్రపాటి మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ తమ బ్యానర్ లో తన తొలి సినిమా చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రొడక్షన్ నం.12గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి కథా కథనాలతో అందరిని ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. దర్శకుడు రాకేశ్ శశి మంచి స్క్రిప్టుతో ముందుకు వచ్చాడన్నారు. మొత్తానికి మెగా హీరోల్లో..ఇప్పుడు అల్లుడు కూడా చేరిపోయదన్నమాట.