Police found that three months old child has been sacrificed at Uppal in Hyderabad by a cab driver.
ఓ ఇంటిపై చిన్నారి తల లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఇంటి యజమానే ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. ఇంటి యజమాని అయిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ చిన్నారిని బలి ఇచ్చినట్లు తేలింది. ఈ నెల 1వ తేదీన ఉప్పల్ చిలుకానగర్‌లో గల రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఇంటిపై మూడు నెలల వయస్సు గల చిన్నారి తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన పోలీసులు దర్యాప్తు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు.
రాజశేఖర్ చర్యలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆ దిశగా పోలీసులు దృష్టి పెట్టి దర్యాప్తు సాగించారు. ఆయన ఇంట్లో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయని పోలసులు తెలిపారు.
కారులో కూడా పూజలకు సంబంధించిన వస్తువులు లభించాయి. దీంతో రాజశేఖర్ క్షుద్రపూజలు చేయించినట్లు పోలీసులు అనుమానించి దర్యాప్తు చేశారు. భార్య అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమె బాగు కోసం రాజశేఖర్ నరబలి ఇచ్చినట్లు చెబుతున్నారు.
చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగుపడుతుందని పూజారి సలహా ఇవ్వడంతో రాజశేఖర్ నరబలికి పూనుకున్నాడు. పసికందును బలి ఇవ్వడానికి కరీంనగర్ జిల్లాలోని తండా నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. తలను ఇంటిపై వేసిన వ్యక్తి పసికందు మొండాన్ని ఎక్కడ వేశాడనేది తెలియలేదు.