If the tax exemption issue between the Board of Control for Cricket in India (BCCI) and Indian government is not sorted out, then India may lose the hosting rights of the ICC Champions Trophy 2021.
భారత్‌లో 2021లో జరిగే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు జరుగుతుందా? లేదా అని క్రికెట్ అభిమానులను సందిగ్ధంలో పడేసింది. ఈ ట్రోఫీ కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి పన్ను మినహాయింపును ఇవ్వకపోతే టోర్నీని మరో వేదికకు తరలిస్తామని బీసీసీఐని ఐసీసీ హెచ్చరించింది.
ఈ మేరకు శుక్రవారం దుబాయ్‌లో జరిగిన తమ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ వేదికలను కూడా చూస్తోంది. 'భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌కు పన్ను మినహాయింపు ఉండడం లేదు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడతామని బీసీసీఐ మాకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఇదే టైమ్‌జోన్‌లో ఉండే ఇతర దేశాలపై మేం దృష్టి సారిస్తాం' అని ఐసీసీ పేర్కొంది.
2011 వరల్డ్ కప్ వరకు భారత్‌లో జరిగిన ఐసీసీ ఈవెంట్లకు అప్పటి ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. 2006లో భారత్‌లోనే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి అప్పటి యూపీఏ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఆయితే ఆ తర్వాత 2016లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం అలాంటి వెసులుబాటును కల్పించలేదు. దీంతో ఈ టోర్నీ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ 10 శాతం టీడీఎస్‌ను భారత ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఐసీసీ చెల్లించడం జరిగింది.
అయితే, భారత ఐటీ అధికారులు మాత్రం ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే ఐసీసీకి ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని తెలిపినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఐసీసీ ఈ దిశగా ప్రయత్నించలేదని తెలుస్తోంది. కాగా, గతేడాది భారత్‌లో నిర్వహించిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌కు మోడీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది.