Andhra Pradesh BJP Ministers pydikondala manikyala rao, kamineni srinivas submitted resignation letter to AP CM Chandrababu Naidu.
ఏపీ బీజేపీ మంత్రులు పైడికొండల మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్‌లు గురువారం ఉదయం తమ పదవులకు రాజీనామా సమర్పించారు. వారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ రాజీనామా పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాణిక్యాల రావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి మూడు నిమిషాల్లో బయటకు వచ్చారు. కామినేని శ్రీనివాస రావు మాత్రం రాజీనామా చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చాంబర్‌లో కాసేపు ఉన్నారు.
మంత్రులు మాణిక్యాల రావు, కామినేనిలు రాజీనామా చేసిన సమయంలో టీడీపీ మంత్రులు వారిని ఆలింగనం చేసుకొని వీడ్కోలు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము రాజీనామా చేయక తప్పని పరిస్థితి వచ్చిందని వారు వెల్లడించారు.
విభజన హామీల కోసం నాడు రాజ్యసభలో పోరాడిన వెంకయ్య నాయుడిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పదవికి రాజీనామా చేసిన మాణిక్యాల రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని కూడా దోషిగా చూపిస్తున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంటుందని, అందుకే తాము తప్పుకోవాల్సి వచ్చిందని మాణిక్యాల రావు చెప్పారు. ప్రత్యేక హోదా బదులు ఏపీకి ప్యాకేజీ ఇస్తామని ప్రకటించామని, ఏపీని ఆదుకుంటామని చెబుతున్నామన్నారు.