Rohit Sharma-led India would aim to seal a final berth in the Nidahas Trophy Twenty20 tri-series
నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్ చివరి దశకు చేరుకుంది. నాలుగు మ్యాచ్‌లు ముగిసినా ఇంకా ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఫైనల్ బెర్తుపై గురిపెట్టింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా పైనల్‌కు అర్హత సాధిస్తుంది.
తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి టైటిల్ పోరుకు చేరువైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.
ఈ టోర్నీలో రిజర్వ్ బెంచ్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా భారత్ ఈ టోర్నీకి అందరూ కుర్రాళ్లను ఎంపిక చేసింది. కానీ మూడు మ్యాచ్‌లు పూర్తయినా ఇంక కొంత మందిని పరీక్షించనే లేదు. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి పాలైన తర్వాత తుదిజట్టు ఎంపికలో భారత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. దీపక్ హుడా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ టోర్నీలో ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనూ వాళ్లు బెంచ్‌కే పరిమితమయ్యేలా ఉన్నారు. దాంతో, ఈ టోర్నీకి ద్వితీయ శ్రేణి జట్టును పంపిన సెలెక్టర్ల ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరనట్టే కనిపిస్తోంది.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆల్ రౌండర్ పాత్రకు విజయ్ శంకర్ మరింత న్యాయం చేయాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయిన జయదేవ్ ఉనాద్కత ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఊహించని రీతిలో అద్భుతాలు చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో సుందర్, చాహల్.. ప్రత్యర్థులను నిలువరిస్తే భారత్‌డ విజయావకాశాలు చాలా మెరుగవుతాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణిస్తే తప్ప భారత్‌కు ఈ గెలుపు అంత సులువు కాకపోవచ్చు.
ఈ మ్యాచ్ కోసం బంగ్లా భారీ మార్పులు చేసేందుకు ఇష్టపడకపోయినా.. ఒకటి, రెండు అవకాశాలను మాత్రం పరిశీలిస్తున్నారు. లంకపై 215 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంతో బంగ్లా జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపడుతాయి. కాబట్టి ఏమాత్రం అలసత్వం లేకుండా ఆడాలని ప్రణాళికలు రచిస్తోంది. బంగ్లా ఆటగాళ్లు లిట్టన్ దాస్, తమీమ్‌లు చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఇక కెప్టెన్ మహ్మదుల్లా సుడిగాలి ఇన్నింగ్స్ బంగ్లాకు లాభించే అంశం. టోర్నీ ఆరంభంతో పోలిస్తే బంగ్లా బౌలింగ్ కూడా గాడిలో పడింది. ముస్తాఫిజుర్, రూబెల్ పవర్‌ప్లే, స్లాగ్ ఓవర్లలో ఆకట్టుకుంటున్నారు. బౌలర్లు మెహిది హసన్, నజ్ముల్ ఇస్లామ్ మ్యాజిక్ చేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.