AP State Finance Minister Yanamala Ramakrishnudu criticized the central government.He said that the central government's attitude was not good in many matters regarding the AP. Why, The central government intervened in the implementation of the state government special schemes, he asked.
రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన పథకాలను ఎపి ప్రభుత్వం అమలు చేసోందని, ఇక్కడి ప్రజలకు ఏం కావాలో కూడా కేంద్రాన్నే అడగాలా?...అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రాష్ట్ర పథకాలు వద్దనే హక్కు కేంద్రానికి ఎక్కడుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై స్పందించారు.
ఎపికి రావాల్సిన ఆదాయ లోటు విషయమై మాట్లాడుతూ 2014-15 కి రూ.16వేల కోట్ల వరకు రెవిన్యూ లోటు ఉందని రిజర్వ్ బ్యాంక్, కాగ్ కూడా నిర్ధారించాయన్న యనమల...నీతి అయోగ్ కూడా లోటు రూ. 14 వేల కోట్లని గుర్తించిందని చెప్పారు. వివిధ అధికారిక విభాగాలు నిర్ధారించిన లోటును కేంద్రం మాత్రం అంగీకరించడం లేదని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు సంబంధించినదని, దీన్నిఆపాలనుకోవడం సరికాదని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటిదాకా తామే నిధులను భరించి కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్ కోరుతున్నామని తెలిపారు. అయితే పోలవరం పనులపై కేంద్రం నిఘా పెట్టి విచారణ చేయిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ కు నిధులు తాము ఖర్చు చేస్తున్నా పనులు మొత్తం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కనుసన్నల్లోనే సాగుతున్నాయని, ప్రతి పైసా ఖర్చును ఆ అథారిటీయే చూస్తున్నప్పుడు మళ్లీ విచారణ దేనికని యనమల ప్రశ్నించారు.
లోక్ సభలో టిడిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోందని యనమల ఆరోపించారు. ఎవరో కొంతమంది సభ్యుల ఆందోళనలను కారణంగా చూపిస్తూ చర్చను తిరస్కరించడం అన్యాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన బిల్లులను గొడవ సమయంలోనూ ఆమోదించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస చర్చను మాత్రం ఇలా గొడవ పేరుతో పక్కన పెట్టడం సరికాదని యనమల విమర్శించారు.