Telangana Rastra Samithi (TRS) parliamentary party meeting held under the chairmanship of K ChandrasekharRao has decided keep away from protest in Parliament.
పార్లమెంటులో తాము చేస్తున్న ఆందోళన నుంచి వెనక్కి తగ్గాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయం తీసుకుంది. సోమవారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో విభజన హామీలపై టిఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే అందులో పాల్గొనాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే, అవిశ్వాసంపై తన వైఖరిని మాత్రం స్పష్టం చేయలేదు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు వస్తే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ సమావేశంలో ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్, కల్వకుంట్ల కవిత, ప్రభాకర్ రెడ్డి, బాల్క సుమన్, కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంటులో అవిశ్వాసం చర్చకు రాకుండా తాము అడ్డుకుంటున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. నాలుగేళ్లుగా రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్ల కోసం ఎంత దాకనైనా వెళ్తామని, ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో నిరసనలు వద్దనుకున్నామని, చర్చకు అవకాశం ఉండాలని కోరుతున్నామని ఆయన చెప్పారు కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే సభను వాయిదా వేసిందని ఆయన అన్నారు.
తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటామని లోకసభ సభ్యుడు జితేందర్ రెడ్డి చెప్పారు. వెల్‌లోకి వెళ్లం గానీ నిరసన తెలియజేస్తామని ఆయన అన్నారు. తన ఆందోళనలను సాకుగా చూపి సభను వాయిదా వేస్తున్నారని అన్నారు. రిజర్వేషనల్ అంశాన్ని చర్చలో చెబుతామని ఆయన చెప్పారు.
తాము మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాల ఎంపీలు తమ తమ సమస్యలపై ఆందోళనకు దిగాయని, తమను మాత్రమే అనడ సరి కాదని వినోద్ కుమార్ అన్నారు. టిడిపి, వైసిపి అవిశ్వాస తీర్మానాలు ఆలస్యంగా ముందుకు వచ్చాయని, తాము ఐదో తేదీ నుంచే ఆందోళన చేస్తున్నామని అన్నారు. కాంగ్రెసు, బిజెపిల తీరును ఆయన తప్పు పట్టారు. చర్చ లేకుంా ఆర్థిక బిల్లును ఆమోదింపజేసుకున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ నాయకులు మాట్లాడుతున్నారని, ఇది చాలా బాధాకరమని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత నాయకులు వారి వైఖరి మార్చుకోవాలని అన్నారు. తమను, తమ ప్రజలను, ఉద్యమాన్ని అవమానపరిచి మాట్లాడడం సరి కాదని అన్నారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి గానీ తమను తప్పు పట్టడం సరి కాదని అన్నారు.