The last rites of the Anchor radhika were done in Hyderabad on Monday. Family members, friends and colleagues from the media fraternity paid their last respects to the news anchor.
తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్న వీ6 న్యూస్ యాంకర్ రాధిక అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరిగాయి. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం మూసాపేటలోని గూడ్స్‌షెడ్ రోడ్డులో ఉన్న సువీలా అపార్ట్‌మెంట్‌కి తీసుకొచ్చారు.
అంత్యక్రియలకు హాజరైన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.. రాధిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయని, అంతమాత్రాన ఆత్మహత్య చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. నటి, యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ.. రాధిక కుమారుడు బుద్ది మాంద్యంతో బాధపడుతున్నాడని, తల్లి లేని ఆ పిల్లవాడిని చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరి పైనా ఉందని గుర్తుచేశారు.
యాంకర్ సత్తితో పాటు, టీయూడబ్ల్యూ రాష్ట్ర నేతలు పి.రవికుమార్, క్రాంతికుమార్, ఎ.మారుతీసాగర్, ఆర్.కె.దయాసాగర్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఓవైపు తల్లి అంత్యక్రియలు జరుగుతున్నా.. బుద్దిమాంద్యం ఉన్న ఆమె కొడుక్కి అదేమి అర్థం కాక అటూ ఇటూ అమాయకంగా తిరుగుతుండటం పలువురిని కంటతడి పెట్టించింది.
యాంకర్ రాధిక ఆత్మహత్య కేసులో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులెవరూ ఆత్మహత్యపై ఫిర్యాదు చేయకపోవడంతో.. సూసైడ్ నోట్ ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు పురిగొల్పాయా?.. లేక మరేమైనా కారణాలున్నాయా? అన్న అంశంపై దృష్టి సారించారు. ఇందుకోసం రాధిక కాల్ డేటాను పరిశీలించనున్నారు. నెల రోజులుగా ఆమె ఎవరెవరితో మాట్లాడిందనే కాల్ డేటాను సేకరించనున్నారు. రాధిక ఇంటి చుట్టుపక్కల వాళ్లను, తోటి ఉద్యోగులను కూడా వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.