Telugudesam Party leader Yalamanchili Ravi to join YSRCP in the presence of YSR Congress Party chief YS Jagan Mohan Reddy.
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు టీడీపీలో చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం గమనార్హం.
గత కొద్ది రోజులుగా యలమంచిలి రవి వైసీపీలోకి వెళ్తారనే వార్తలు వస్తున్నాయి.
యలమంచిలి రవి వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటి నుంచే టీడీపీ అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆయనను పిలిచి మాట్లాడారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయనను అధినేత వద్దకు తీసుకు వెళ్లారు. కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు.ఆయన పార్టీ మారేందుకే నిర్ణయం తీసుకున్నారు.
వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర గుంటూరులో కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో ఈ యాత్ర విజయవాడలో అడుగుపెట్టనుంది. అదే రోజు యలమంచిలి రవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇది టీడీపీకి గట్టి దెబ్బే. ఎన్నికలకు ఏడాది ముందు ఈ పరిణామాలు ఆ పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు.
కాగా, 2014 నుంచి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని భావించి టీడీపీ వారిని చేర్చుకున్నట్లుగా భావిస్తారు. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగకుంటే టీడీపీకి ఆపరేషన్ వికర్ష తప్పదని అంటున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ, వైసీపీ నుంచి దెబ్బ ఉంటుందని అంటున్నారు.