Miscreants were today detained by the police for hurling a shoe at India international Ravindra Jadeja during an IPL match between Chennai Super Kings and Kolkata Knight Riders.
ఐపీఎల్‌లో భాగంగా చేపాక్ స్టేడియంలో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే నిరసనకారులు అడ్డుకోవడంతో కోల్‌కతా జట్టు ఆలస్యంగా స్టేడియానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
దీంతో 13 నిమిషాలు టాస్ ఆలస్యంగా ప్రారంభమైంది. కావేరీ జల వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ నిరసనకారులను నియంత్రించలేకపోయారు. మ్యాచ్ జరుగుతుండగా నిరసనకారులు షూ విసిరి మ్యాచ్‌కు ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు.
దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావేరి సమస్యపై పోరాడుతున్న ఓ పార్టీకి ఆ ఇద్దరు వ్యక్తులు మద్దతుదారులుగా పోలీసులు భావిస్తున్నారు.
మ్యాచ్ ఆరంభానికి ముందే నిరసనకారులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినప్పటికీ.. నిరసనకారులు మాత్రం ఆటగాళ్లపై బూట్లు విసిరి తమ గోడును వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.