In Kaala, Rajnikanth has never looked so good on screen with his stylised look and presentation, Patori body language, and dialogue delivery.
దశాబ్దాలుగా వెండి తెర సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఐకాన్‌గా మారారు. పాలిటిక్స్‌పై దృష్టిపెట్టిన తలైవా.. కాస్తా రూట్ మార్చి సామాజిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో దర్శకుడు పా రంజిత్‌తో రజనీ కలిసి రూపొందించిన కబాలి చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రజాదరణ పొందలేదు. ఆ సినిమా ఆశాజనకంగా ఆడకపోయినప్పటికీ.. కాలా కోసం మళ్లీ పా రంజిత్‌తో జతకట్టారు. హీరో ధనుష్ నిర్మాతగా మారారు. ముంబై మురికివాడ ధారవి బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన కాలా చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కరికాలుడు అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబై మురికవాడ ధారవి ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడే నేత. స్వచ్ఛ మహారాష్ట్ర స్కీం కింద ధారవిలో నివసించే ప్రజలను ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వీకారం చుట్టడానికి ప్రయత్నిస్తుంటాడు హరిదాదా (నానా పాటేకర్). అందుకోసం విష్ణు సేఠ్ (సంపత్ రాజ్)ను ఉపయోగించుకొంటాడు. హరిదాదా వేసే ఎత్తుకు కాలా పై ఎత్తులు వేసి తన నేలను రక్షించుకొంటాడు. ఈ క్రమంలో ధారవిలో పుట్టి పెరిగిన కాలా మాజీ ప్రేయసి జరీనా ( హ్యుమా ఖురేషి) ఈ వ్యవహారంలోకి ప్రవేశిస్తుంది.
ధారవి నేల కోసం పోరాడే కాలాను హరిదాదా గ్యాంగ్ ఎలాంటి సమస్యలకు గురిచేసింది? నేల కోసం తన భార్య స్వర్ణ (ఈశ్వరీరావు)ను ఎలా కోల్పోతాడు? కాలాకు జరీనా ఎలా దూరమైంది? హరిదాసు భూకాంక్షను ఎలా ఎదుర్కొన్నాడు? తాము జీవించే నేలను దక్కించుకోవడానికి ధారవి ప్రజల్లో కాలా ఎలా స్ఫూర్తిని నిలిపాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే కాలా చిత్ర కథ.
ధారవి ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసే ప్రయత్నాలను ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోవడమనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో ధారవి ప్రజలకు అండగా నిలచేందుకు కాలా పాత్ర ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కాలా కుటుంబ కథ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కథ సాగుతుంది. ఇక జరీనా పాత్ర ఎంట్రీతో కాలా ప్రేమ ఎపిసోడ్‌తో చకచకా ముందుకెళ్తుంది. ఇంటర్వెల్‌కు ముందు కాలాను ఎటాక్ చేయడానికి చేసే సీన్, అలాగే ఫ్లై ఓవర్‌పై విష్ణు సేఠ్‌ను చంపే సీన్లు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. హరిదాసు క్యారెక్టర్‌కు ధీటైన సమాధానం చెప్పే సీన్‌తో ఇంటర్వెల్‌కు తెరపడుతుంది.