ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా కోరుతూ ఢిల్లీలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు సెల్ టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్‌పై ఎక్కిన యువకుడు.. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బ్యానర్ చేతిలో పట్టుకుని నినాదాలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతనికి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఆ యువకుడిని వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఆ యువకుడితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
క్రేన్ సహాయంలో పైకి ఎక్కి అతనితో మాట్లాడారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత తెలుగు తెలిసిన తెలుగు జర్నలిస్టులను పైకి తీసుకెళ్లికెళ్లి అతనితో మాట్లాడించారు. అయితే, హోదాపై ప్రకటన చేస్తేనే దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరింపులకు గురిచేశాడు ఉమేష్. పోలీసులు, జర్నలిస్టులు ఆ యువకుడితో గంటకుపైగా చర్చలు జరిపి అతడ్ని క్షేమంగా టవర్ పైనుంచి కిందికి దించారు. కాగా, అతడు కాంగ్రెస్ పార్టీ అభిమాని అని తెలిసింది. గత వారం రోజుల నుంచి అతడు ఏపీ భవన్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ అనే నినాదాలు చేశాడు ఉమేష్.