CM Chandrababu Interacts With Students at Tallapalem : అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో భాగంగా అక్కడి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శుభ్రత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లల ఆలోచన విధానంలో మార్పులు వచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థినులతో సీఎం చంద్రబాబు మాటామంతి నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విద్యార్థులు అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు. త్వరలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేసి ఏవైనా సమస్యలు, లోపాలను ఉంటే సరిచేస్తామన్నారు. విద్యార్థినులతో మాట్లాడి వివిధ అంశాలపై చర్చించారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తనది బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేలా దీన్ని చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థినులతో మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి అని సూచించారు.