Prime Minister Narendra Modi will spreahead the BJP campaigning for the Gujarat elections from around November 18, BJP sources said. Elections to Gujarat's 182 seats assembly will be held on December 9 and 14.
భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ శాసన సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గుజరాత్ లో మరోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టేలా నరేంద్ర మోడీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ ఎన్నికలపై ప్రతేక దృష్టి పెట్టారు. సొంత రాష్ట్రంలో 182 నియోజక వర్గాల్లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రావాలని కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. గుజరాత్ లోని 33 జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో 36కు పైగా ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
ప్రతి జిల్లాలో మూడు నుంచి ఐదు శాసన సభ నియోజక వర్గాల్లో నరేంద్ర మోడీ పర్యటించేలా ఎన్నికల షెడ్యూల్ రూపకల్పనపై బీజేపీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు. నవంబర్ 18వ తేదీ శనివారం నరేంద్ర మోడీ గుజరాత్ లో మొదటి పర్యటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గుజరాత్ లో గత 22 ఏళ్ల నుంచి బీజేపీనే అధికారంలో ఉంది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ విఫలయత్నం చేస్తోంది. గుజరాత్ లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కుల సమీకారణాలతో బలమైన కూటమిగా ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది.