The Telugu Desam Party MPs have decided to talk tough in Parliament on issues related to the state and convey to the Centre the displeasure and anger of the people of the state over lack of specific budgetary allocations for the major projects in the state such as the Polavaram irrigation project and the construction of the new capital Amaravati, and the promised new railway zone at Visakhapatnam
బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంతో ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకోవద్దని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి బీజేపీ నేతల నుంచి కూడా టీడీపీ అధినేతకు ఫోన్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దోస్తీకి వచ్చిన నష్టం లేదు. అయితే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడంతో దానిపై పార్లమెంటులో, బయట పోరాడాలని టీడీపీ నిర్ణయించుకుంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకు వచ్చే ప్రయత్నాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.సోమవారం విభజన అంశాలపై లోకసభలో స్వల్పకాలిక చర్చకు టీడీపీ నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ తోట నర్సింహం లోకసభలో విభజన అంశాలపై చర్చ కోసం 193 నిబంధన కింద నోటీసులు ఇచ్చారు. మరోవైపు రాజ్యసభలో నిరసన తెలిపేందుకు టీజీ వెంకటేష్, సీఎం రమేష్‌లు సిద్ధమయ్యారు.
ప్రజలకు చెప్పేందుకు, కేంద్రం ముందు తమకు న్యాయం జరగలేదని వివరించేందుకు టీడీపీ ఎంపీలు అన్ని లెక్కలను తీస్తోంది. ఏపీ అడిగింది ఏమిటి, ఇచ్చింది ఏమిటి అనే విషయాలను అందరి ముందు ఉంచేందుకు వారి సిద్ధమవుతున్నారు. అడిగినవాటికి, ఇచ్చిన వాటికి పొంతన లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
విభజన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఆర్థిక లోటు రూ.16,500 కోట్లు అయితే, కేంద్రం రూ.7,500 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని, అందులోను ఇంకా రూ.3,382 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. పోలవరంకు ఏపీ రూ.7,.431 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ.4,323 కోట్లు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏపీ అడిగింది రూ.11వేల కోట్లు అయితే మంజూరు చేసింది రూ.2500 కోట్లు, అందులో విడుదల చేసింది రూ.1500 కోట్లు.
కాగా, బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని, రాష్ట్ర ప్రజల్లోని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాలను కేంద్రానికి అర్ధమయ్యేలా చెప్పాలని టీడీపీ ఆదివారం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నదని వార్తలు వచ్చినప్పటికీ పార్లమెంటులో పోరాడాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను సాధించుకునేంత వరకు దశలవారీగా కేంద్రంపై ఒత్తిడి పెంచనుంది.