Actor-politician Kamal Haasan says he held a secret meeting with his contemporary and friend Rajinikanth about his entry into politics.
రాజకీయ రంగప్రవేశానికి ముందే తాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో రహస్యంగా భేటీ అయ్యానని మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమావేశం అయిన రోజు తన రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘంగా చర్చించానని, కాలాతో కలిసి పని చెయ్యడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ హాసన్ వివరించారు. జాతీయ జెండాలోనే కాషాయం ఉందని కమల్ గుర్తు చేశారు.
కమల్ హాసన్ తమిళ వారపత్రిక ఆనంద వికటన్ కు రాసిన వ్యాసంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావాలని గత ఏడాది మానసికంగా సిద్దం అయ్యానని, ఇప్పుడు ఆచరిస్తున్నానని వివరించారు. రజనీకాంత్ సూచన మేరకు షూటింగ్ గ్యాప్ లో తామిద్దరం రహస్యంగా కలిసి రాజకీయ అంశాలపై మాట్లాడామని కమల్ హాసన్ స్పష్టం చేశారు. మొదట తన రాజకీయ రంగప్రవేశంపై రజనీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అనంతరం ప్రజాసేవ చెయ్యడానికి సిద్దం కావాలని తనను ఆయన ప్రోత్సహించారని వివరించారు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కాషాయ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నాని కమల్ హాసన్ మరోసారి స్పష్టం చేశారు. కాషాయాన్ని తాను కించపరుస్తున్నానని కొందరంటున్నారని, అది ఏమాత్రం వాస్తవం కాదని, కషాయం త్యాగానికి ప్రతీక అని ప్రపంచానికే తెలుసని కమల్ హాసన్ వివరించారు.మన జాతీయ జెండాలో కాషాయం రంగు ఉందని, అయితే ఆ కాషాయం జెండా మొత్తం వ్యాపించకూడదని వివరించారు. రజనీకాంత్, బీజేపీ తమిళనాడు నాయకులను దృష్టిలో పెట్టుకుని కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిసింది.