Raina wanted to use the T20s as a platform to make a comeback into the ODI team but was aware that he has to face stiff competition to find a place in the Indian middle-order.
మూడో స్ధానంలో తనను బ్యాటింగ్ చేసేందుకు అంగీకరించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా థ్యాంక్స్ చెప్పాడు. సుమారు ఏడాది తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న సురేశ్ రైనా చివరి టీ20 జరుగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు.
'ఇది నాకు నిజంగా చాలా ముఖ్యం. నాపై కోహ్లీ నమ్మకం ఉంచడంతోనే జట్టులో స్థానం సంపాదించాను. ఒక కెప్టెన్ నమ్మకాన్ని సంపాదించి జట్టులో పునరాగమనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీ20ల్లో తొలి రెండు గేమ్‌ల్లో మా ప‍్రదర్శన బాగుంది. ముఖ్యంగా పేసర్లు అద్భుతంగా రాణించారు' అని అన్నాడు.
'ఆఖరి మ్యాచ్‌లో కూడా ఘనంగా ఉండాలనే భావిస్తున్నాం. జట్టుని కోహ్లీ నడిపిస్తున్న తీరు అద్భుతం. టెస్టులతో పాటు వన్డే సిరిస్‌ను నెగ్గడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతి ఒక్కరూ విజయాలను ఎంజాయ్ చేస్తున్నారు. కోచ్ రవిశాస్త్రికి వారి యొక్క అభిప్రాయాలను తెలుపుతున్నారు' అని రైనా పేర్కొన్నాడు.
'భారత టాపార్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. ఇక, మిడిలార్డర్ విషయానికి వస్తే ధోని, మనీష్ పాండేలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ బ్యాటింగ్ ఆర్డర్‌లో నేను ఎక్కడ ఫిట్ అవుతానో చూడాలి. ఫార్మాట్ ఏదైనా సరే మ్యాచ్‌ల్లో గెలవడం ఎంతో ముఖ్యం. మా కెప్టెన్ కోహ్లీ కూడా భావిస్తున్నది ఇదే. ఏ విషయాన్నైనా ఈజీగా తీసుకోడు' అని తెలిపాడు.
'విజయం కోసం చివరి వరకు పోరాడే తత్వం కోహ్లీది. ఆ క్రమంలోనే ఆటగాళ్లపై కొన్ని సమయాల్లో కఠినంగా కూడా వ్యవహరిస్తాడు. తొలి ఆరు ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే భారీ స్కోరుకు ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్ చేసే సమయంలో మొదటి ఆరు ఓవర్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి' అని రైనా వెల్లడించాడు.