Senior Congress leader P Chidambaram appeared to have a premonition of the arrest of his son Karti when he filed a petition recently in the Supreme Court.
ఐఎన్‌ఎక్స్ కేసులో తన కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అనుమానపడ్డారు. అందుకే ముందుగానే సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. అయితే ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాకమునుపే వారి భయం నిజమైంది. కార్తీ చిదంబరాన్ని దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం అరెస్టు చేసింది.
మోడీ సర్కారు దూకుడు చూసి చిదంబరం, ఆయన కొడుకు కార్తీ ముందే భయపడ్డారు. అందుకే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను, తన కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని, వాటిని నిరోధించాలని కోరుతూ చిదంబరం ముందుగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బుధవారం ఉదయం లండన్ నుంచి చెన్నై చేరుకున్న కార్తిని ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం చెన్నై విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది.
సీబీఐ అధికారుల దర్యాప్తు, ఈడీ నోటీసులపై పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా మార్చి 1న హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని లేదా విచారణ తేదీని వాయిదా వేయాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో కార్తీ చిదంబరం పిటిషన్ విచారణ సమయంలో కార్తీ అరెస్టుకు సంబంధించి సీబీఐ తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ కార్తీ ‘సాధారణ నేరస్థుడు' కాదని పేర్కొన్నారు. ఆ మాటలకు అర్థం.. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే సంకేతమే! కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేస్తామని తామెప్పుడూ చెప్పలేదన్నారు. కానీ, అరెస్టు విషయంలో సీబీఐదే తుది నిర్ణయమని తుషార్ మెహతా తెలిపారు. ఒకవైపు సీబీఐ కేసు విచారణ జరుగుతుండగా.. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించాలని లేదా వాయిదా వేయాలని కార్తీ కోరడం సరికాదని ఆయన వాదించారు.