Karnataka BJP leader G Janardhana Reddy has reacted over establishment of steel plant in Kadapa. He spoke about this issue at a press meet on sunday. He said that he had spent nearly Rs 1350 crore so far for Brahmani steels, so he demanded the steel plant works has to give to him.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఆందోళనలు ఉధృతమౌతున్న నేపథ్యంలో కర్ణాటక బిజెపి నేత గాలి జనార్థన్ రెడ్డి స్పందించారు. ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఇదే విషయమై ఆయన మాట్లాడారు. తాను బ్రహ్మణీ స్టీల్స్ కోసం ఇప్పటి వరకూ దాదాపు 1350 కోట్లు ఖర్చు చేశానని, కాబట్టి స్టీల్ ప్లాంట్ పనులు తనకే ఇవ్వాలని గాలి జనార్థన్ రెడ్డి కోరారు. తనకు అనుమతిస్తే రెండేళ్లలోనే స్టీలు ప్లాంట్ కడతా అన్నారు. అయితే కేంద్రం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా స్టీల్ ప్లాంట్ పెట్టినా తనకు అభ్యంతరం లేదన్నారు. అలాగే ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ పనులు ఇతరులకు అప్పగిస్తే తాను పెట్టిన పెట్టుబడి డబ్బు తిరిగి ఇచ్చేయాలని గాలి జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మించడం సాధ్యం కాదంటూ మెకాన్ సంస్థ నివేదిక ఇవ్వడాన్ని బిజెపి నేత గాలి జనార్ధన్ రెడ్డి తప్పు బట్టారు. కడప జిల్లాలో స్టీలు ప్లాంటు స్థాపించాలనే డిమాండ్‌తో జరుగుతున్న పోరాటాలను మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 2007, జూన్ 10న జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గాలి జనార్దనరెడ్డి గుర్తు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమకు అన్ని అవకాశాలు ఉన్నాయని అదే మెకాన్ సంస్థ గతంలో నివేదిక ఇచ్చిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే సంస్థ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఫీజుబిలిటీ కాదని చెప్పడంపై ఆయన మండిపడ్డారు.