Presidents Invitation to Indian Blind Women T20 Captain Deepika : భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీపికకు మరో గౌరవం దక్కింది. దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను తపాలశాఖ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని దీపిక స్వగ్రామం తంబాలహట్టికి వెళ్లి స్వయంగా అందజేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని దీపిక అన్నారు. వేడుకలను స్వయంగా తిలకించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఇందుకు అవకాశం కల్పిస్తున్న రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.
అంధుల మహిళా టీ-20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ దీపికకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిత్యవవసరాలు, గృహోపకరణాలు అందజేసిన సంగతి తెలిసిందే. కోరిన వెంటనే గ్రామానికి రోడ్డును మంజూరు చేసి, ఇంటికి సరకులు, వస్తువులు, దుస్తులను అందించిన పవన్ కల్యాణ్‌కు దీపిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.