Telangana minister KT Rama Rao retaliated Congress leader Revanth Reddy's allegations on power purchases.
విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కెటి రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో చిప్పకూడు తిన్నవాళ్లు కూడా అవినీతి గురించి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని కెటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు నేతల మధ్య సాగుతున్న వివాదంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు.
తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరా ప్రారంభమైనప్పటి నుంచి టిఆర్ఎస్, కాంగ్రెసు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి చోటు చేసుకుందని, అందులో కేసీఆర్ ప్రమేయం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.
విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతిపై చర్చకు ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంంగా ఉన్నానని, ప్రభుత్వం సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దానిపై కేటీఆర్ స్పందించారు. అవినీతి నాయకుడి సవాళ్లకు తాము స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
జైలులో చిప్పకూడు తిన్నవారి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని కెటిఆర్ అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ పంపిణీ విజయవంతం కావడంతో కాంగ్రెసు నేతలకు కడుపు మండుతోందని ఆయన అన్నారు.