Telugu Desam party MPs along with union ministers Sujana Chowdary and Ashok Gajapathi Raju met union minister Rajanth Singh.Amid strained ties between the BJP and the ruling TDP in Andhra Pradesh, a delegation of TDP MPs met Home Minister Rajnath Singh on Monday.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, తక్షణం రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎంపీలకు హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి పెద్దగా అభయం రాలేదని తెలుస్తోంది. వారు సోమవారం ఆయనతో భేటీ అయిన విషయం తెలిసిందే.ముందస్తు అపాయింటుమెంట్ల కారణంగా ఆయనను కలిసేందుకు టిడిపి ఎంపీలు దాదాపు గంటకు పైగా వేచి చూశారు. ఆ తర్వాత కేవలం 15 నిమిషాలలో ఆయనతో భేటీ ముగిసింది. ఆ సమయంలోనే వారు ఏపీకి రావాల్సిన హామీల గోడును వెళ్లబోసుకున్నారు. రాజ్‌ను కలిసిన వారిలో అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, తోట నర్సింహం, నిమ్మల కిష్టప్ప, రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.
కేంద్రంపై టీడీపీ తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఆదివారం సీఎం చంద్రబాబుతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. సోమవారం టీడీపీ ఎంపీలను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆరా తీశారు.అందుకు టీడీపీ ఎంపీలు స్పందిస్తూ.. ప్రతి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి భారీగా నిధులిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ, చివరి బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి కనిపించడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని చెప్పారు. రాజకీయంగా ఇది రెండు మిత్ర పక్షాలకు మంచిది కాదన్నారు. అందుకే చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టి తీవ్రనిరసన వ్యక్తం చేశారని తెలిపారు.