TDP MP JC Diwakar Reddy said key comments on special status issue of Andhra Pradesh.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశం, కేంద్ర బడ్జెట్‌లో సరైన న్యాయం జరగలేదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు విమర్శల వేడిని పెంచాయి.
ఓ వైపు మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలే పరస్పరం విమర్శలు గుప్పించుకుంటుంటే.. మరోవైపు వైసీపీ ఈ రెండు పార్టీలను విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం నుంచి ఏపీకి పెద్దగా ఏమీ రావని, ఆశలు వదులుకోవాల్సిందే అని ఎంపీ జేసీ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఏపీకి సాయం చేసేందుకు కట్టు బడి ఉందని బీజేపీ నేతలు చెబుతుండగా, జేసీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది ఇలా ఉండగా, ఏపి సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా పరువు తీసింది మీరా మేమా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పరువు తీసిందెవరో జపాన్ కంపెనీ విషయంలోనే అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు ఇతరులపై రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎంతటికైనా తెగిస్తారని స్పష్టం చేశారు. తమ అధినేతపై ఎంత ఎదురు దాడిచేసినా ఆయన భయపడరన్నారు. రాష్ట్రం పరువు చంద్రబాబే తీస్తున్నారని , సీఎం పంచాయతీలు చెప్పారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పడంతోనే ఈ విషయం స్పష్టమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.