A three-day search conducted by the CBI and the ED at Nirav Modi's Samudra Mahal in Worli has revealed treasures running into several crores.
మూడు రోజుల పాటు సిబిఐ, ఈడీ నిర్వహించిన సోదాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోడీకి సంబంధించి దిమ్మ తిరిగే సంపద బయటపడింది. ఈ మేరకు శనివారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
సిబిఐ, ఈడి అధికారులు మూడు రోజుల పాటు ముంబైలోని సముద్ర మహల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. పెద్ద యెత్తున వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విలువైన వస్తువులు వారికి చిక్కాయి.
సిబిఐ, ఈడి అధికారులకు చిక్కిన రింగ్ విలువ పది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాచీ రూ.1.40 కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు. ప్రాచీన ఆభరణాలు, అరుదైన పెయింటింగ్స్ కూడా నీరవ్ మోడీ నివాసంలో ఉన్నాయి. వాటి విలువ కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు.
నీరవ్ మోడీ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలుపను లెక్క కట్టే పనిలో సిబిఐ, ఈడి అధికారులు ఉన్నారు. తమకు చిక్కిన వస్తువుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
నీరవ్ మోడీకి చెందిన 21 ఆస్తులను ఈడీ గత నెలలో సీజ్ చేసింది. వాటిలో ఓ పెంట్‌హౌస్, ఓ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ర.523 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ మోడీ గానీ చోక్సీ గానీ దేశానికి తిరిగి రావడానికి సిద్ధపడడం లేదు.