కాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం పక్కదారి పట్టింది. ఎవరూ ఊహించని విధంగా అసలు అంశం సైడ్ ట్రాక్ అయిపోయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఫోకస్ మళ్లింది. శ్రీరెడ్డి తన నోటి దురుసుతో పవన్ కళ్యాణ్‌ను బూతులు తిట్టిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.
ఇది చాలదన్నట్లు తన స్నేహితురాలు, ట్రాన్స్ జెండర్ తమన్నాతో శ్రీరెడ్డి మాట్లాడిన ఫోన్ టేపు లీక్ కావడంతో పరిస్థితిని మరింత జఠిలం అయింది. ఈ ఫోన్ కన్వర్జేషన్లో నేను చచ్చే వరకు పవన్ కళ్యాణ్ ఓటమి కోసం కృషి చేస్తానని శ్రీరెడ్డి చెప్పడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్నటి వరకు శ్రీరెడ్డి మీద పాజిటివ్ ఓపీనీయన్ ఉన్న వారిలో కూడా ఈ ఫోన్ టేపు లీక్‌తో ఆమెపై నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేసింది.
ఈ లీకు వ్యవహారంతో శ్రీరెడ్డి వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను తొక్కేయడానికి శ్రీరెడ్డిని ఇతర పార్టీలు ఉపయోగించుకుంటున్నాయనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది.
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో శ్రీరెడ్డి షాయ్యారు. తాను ఈ పోరాటం మొదలు పెట్టడానికి గల కారణం ఏమిటి? తాను చేయాలనుకున్నది ఏమిటి? ప్రస్తుతం తాను చేస్తున్నది ఏమిటి? అనే విషయంలో రియలైజ్ అయిన శ్రీరెడ్డి....... ఫోన్ టేపు లీక్ అనంతరం ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాను కాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేస్తున్నానని, కానీ తన వెనక తనకు తెలియకుండానే ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయని, వాటి ప్రభావానికి తాను గురయ్యానని, ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విషయంలో అలా ప్రవర్తించాల్సి వచ్చిందని........ దీని వెనక రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండటంతో ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అని శ్రీరెడ్డి తన సోషల్ మీడియా పేజీ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.