కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకొన్న సునీల్ అందాలరాముడు అనే చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత మర్యాద రామన్న లాంటి ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు ఆయనను వెంటాడాయి. ఈ నేపథ్యంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన 2 కంట్రీస్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ నటించిన పాత్రను సునీల్ పోషించగా, ఎన్ శంకర్ దర్శకత్వం వహించారు. సంసారం అనే చదరంగంలో పావులుగా మారిన భార్యాభర్తల సంబంధాలు, రెండు దేశాల మధ్య వైవాహిక జీవితంలోని పరిస్థితులను ఆధారంగా చేసుకొన్న 2 కంట్రీస్ చిత్రం ఎలా ఉందని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఉల్లాస్ కుమార్ డబ్బు కోసం ఏదైనా చేసే మనస్తత్వం. రాజకీయ నేతలను బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసేంత డబ్బు పిచ్చి. కట్నం భారీగా వస్తుందని అంగవికలురాలైన పటేల్ (షియాజీ షిండే) చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతాడు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉండే లయ (మనీషా రాజ్)తో పెళ్లి కుదరడంతో పటేల్ చెల్లెల్ని కాదంటాడు. ఉల్లాస్‌ను లయ పెళ్లి చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంటుంది. అలా భార్యగా మారిన లయ మద్యానికి బానిస. ఆ విషయం పెళ్లి తర్వాత తెలుస్తుంది. అమెరికాకు వెళ్లిన తర్వాత ఓ కారణంగా ఉల్లాస్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్తుంది.
ఉల్లాస్, లయకు కోర్టు విడాకులు మంజూరు చేసిందా? విడాకులు తీసుకొన్న తర్వాత ఉల్లాస్ పరిస్థితి ఏమిటి? లయ ఎందుకు విడాకులు కోరింది? ఏపీలోని వెంకటాపురం అనే గ్రామంలో ఉండే ఉల్లాస్‌ను అమెరికాకు చెందిన లయ ఎందుకు పెళ్లి చేసుకొన్నది? విడాకులు తీసుకొన్న ఉల్లాస్, లయ జీవితానికి క్లైమాక్స్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే 2 కంట్రీస్ మూవీ కథ