మన భారతదేశ జాతిపిత అయిన మహాత్మాగాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కునే పద్ధతులను స్ఫూర్తిగా తీసుకుని జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదట అధ్యక్షుడు నెల్సన్ మండేలా! ఈయన పూర్తిపేరు నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు అయిన ఈయన... ఆ దేశానికి పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈయన జీవిత విశేషాలు, ఆశయాలకు సంబంధించి తెలుగులో కూడా ‘‘నల్లజాతి సూరీడు’’ అనే పేరుతో పలువ్యాసాలు కూడా వర్ణించబడి వున్నాయి.
మండేలా అధ్యక్షుడు కాకముందు జాతివివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించిన మొదటి ఉద్యమకారుడు. ఈయన జరిపిన ఈ వ్యతిరేక పోరాటంలో ఒక మారణకాండకు సంబంధించి దాదాపు 27 సంవత్సరాలవరకు ‘‘రోబెన్’’ అనే ద్వీపంలో జైలు శిక్షను అనుభవించాడు. దాంతో ఈయన జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు ప్రపంచవ్యాప్తంగా సంకేతంగా నిలిచిపోయాడు. 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధులైన నాయకుల జాబితాలో ఈయన తన పేరును నమోదు చేసుకోగలిగాడు. రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన అనంతరం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు, దాని సాయుధ విభాగమయిన ‘‘ఉంకోంటో విసిజ్వే’’కి అధ్యక్షుడిగా పనిచేశారు.